Mar 29,2022 23:18

పాఠశాల గది


ఒంటి పూట బడులు ఊసెత్తని ప్రభుత్వం
ఉక్కపోత, కరెంటు కోతతో ఇక్కట్లు

ప్రజాశక్తి- చిత్తూరుప్రతినిధి
ఉపాధ్యాయులపై ఉన్న అక్కస్సు విద్యార్థులకు శాపంగా మారింది. ఏప్రిల్‌ నెల ప్రారంభవుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒంటి పూట బడుల ఊసెత్తడం లేదు. దీంతో పిల్లలు అల్లాడుతున్నారు. ఒక పక్క ఉక్కపోతతో, మరో వైపు కరెంటు కోతలతో వారి బాధలు వర్ణనాతీతం. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 3,748 ప్రాథమిక, 440 ప్రాథమికోన్నత, 636 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 3,54,410 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రతి ఏడాదీ వేసవి వస్తుందనగా మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను ప్రభుత్వం నిర్వహించేంది. ఇలా ఏప్రిల్‌ 21 వరకు ఇదే విధంగా సాగుతుంది. తరువాత వేసవి సెలవులుంటాయి. ఎండల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకూడనే ఉద్దేశంతోనే ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ప్రభుత్వం ఒంటి పూట బడుల మాటే ఎత్తడం లేదు. ఇలాంటి అవసరం లేదని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకిలా
తమ కోపం ముందు ఎంత మంది ఇక్కట్లు పడుతున్నా ఇబ్బంది లేదు అనే తీరులో ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పిఆర్‌సిపైన ఇటీవల పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన అరకొర పిఆర్‌సిని తీసుకుని కోపం ఉన్నా దిగమింగుకుని పోరాటానికి ముందుకు రాకుండా ఉండిపోయారు. అయితే ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వం పోరు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వీరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్ని కుతంత్రాలు పన్నినా నెగ్గలేకపోతోంది. దీంతో ఉపాధ్యాయులపై కక్ష సాధింపుగా ఒంటి పూట బడులకు అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా కరోనా వల్ల రెండు నెలలు ఆలస్యంగా సిలబస్‌ నడుస్తోంది. దీన్ని పూర్తి చేయాలంటే ఒంటిపూట బడులు సాధ్యం కాదనేటట్లుగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా మంచి ఎండల్లో పిల్లలు ఇళ్లకు ఎలా వెళతారని..? సాయంకాలం వరకు పాఠశాలలోనే ఉండి ఎండతగ్గాక నాలుగు గంటలపైన ఇళ్లకు వెళితే సరిపోతుందని వింతగా చర్చిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వస్తే వెంటనే ఉపాధ్యాయ సంఘాలు, నాయకులు ప్రభుత్వ వైఖరిని ఖండించేవారు. అయితే ఈ విధంగా ఎవరూ అనడం లేదు. తమ సెలవుల కోసం పిల్లలు చదువులను నాశనం చేస్తున్నారని వైసిపి నాయకులు విమర్శిస్తారని ఎవరూ నోరు మెదపడం లేదు.
ఇక్కట్లలో విద్యార్థులు
అయితే ప్రభుత్వం విధానం వల్ల పిల్లలు ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు పిల్లలు ఎండలకు బడిలోనే ఉంటున్నారు. ముందులా కాకుండా పల్లెల్లో అనధికార కరెంటు కోతలు ఉంటున్నాయి. ఫ్యాన్లు లేకపోవడం వల్ల ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఒకే గదిలో 50 మందికిపైగా విద్యార్థులున్న ప్రాంతాల్లో వీరి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.