Jun 24,2023 08:59

544-డి నిర్వాసితులకు న్యాయం చేయాలని రైతుసంఘం, నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు(ఫైల్‌ ఫొటో)

           అనంతపురం ప్రతినిధి :అనంతపురం జిల్లా మీదుగా జాతీయ రహదారి 544-డి విస్తరణ పనులు మొదలయ్యాయి. పనులు ప్రారంభమైనా పరిహారం విషయంలో స్పష్టత లేక నిర్వాసితుల్లో అయేమయం నెలకొంది. టెండరు ప్రక్రియ పూర్తయి సర్వే దాదాపు పూర్తయ్యింది. ఈ రోడ్డు ఏర్పాటు వల్ల ఇళ్లు, భూములు కోల్పోనున్న నిర్వాసితుల్లో పరిహారం పరిస్థితి ఏమిటన్న ఆందోళన మొదలైంది. మార్కింగ్‌లు చేసుకుంటూ పోతున్న అధికారులు పరిహారం విషయమై పెదవి విప్పడం లేదు. ఎంత పరిహారం ఇస్తారన్న దానిపై స్పష్టనివ్వకపోవడంతో గుబులు రేగుతోంది. పాత అంచనాల ప్రకారం కాకుండా విలువ ఆధారంగా పరిహారమివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు మాత్రం పాత అంచనాల ప్రకారమే పరిహారం పంపిణీకి సిద్ధపడ్డారు.
జాతీయ రహదారి 44 నుంచి జాతీయ రహదారి 16కు అంటే అనంతపురం నుంచి విజయవాడకు రహదారి విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. దీనికి 544-డి అని పేరుపెట్టారు. వాస్తవానికి ఇది 2014లోనే మంజూరైంది. అప్పట్లో ఈ ప్రక్రియ టెండరు దశ వరకూ వచ్చింది. ఈసమయంలో అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్‌ ఫీల్డ్‌ అంటే పూర్తిగా కొత్త రహదారి నిర్మాణం చేపట్టే ఆలోచనతో 544-డిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2019లో అధికారం మారాక గ్రీన్‌ఫీల్డ్‌కు ప్రభుత్వం స్వస్థి పలికింది. కొత్తగా బెంగళూరు - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను తెరపైకి తెచ్చింది. ఇది రావడంతో తిరిగి ఇప్పుడు 544-డి మళ్లీ తెరపైకి ఇచ్చింది. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయ్యి అనంతపురం నుంచి భోగసముద్రం వరకు 69 కిలోమీటర్ల మేర ఈ జిల్లాలో రహదారి నిర్మాణం జరగనుంది. దీనికి భూసేకరణ జరగాల్సి ఉంది.
500 హెక్టార్ల భూమి అవసరం
అంతపురం నుంచి భోగసముద్రం వరకు నిర్మిస్తున్న 544-డి నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి సుమారు 500 హెక్టార్ల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఉన్న భూమి కాకుండా ఇది అదనంగా అవసరమవనుందని అధికారులు చెబుతున్నారు.
పరిహారంపై స్పష్టతనివ్వని అధికారులు
ఏడు మండలాలు, 34 గ్రామాల గుండా ఈ రహదారి వెలుతోంది. అనంతపురం నుంచి ముచ్చుకోట వరకు ఒక ప్యాకేజీ, అక్కడి నుంచి బోగసముద్రం వరకు రెండో ప్యాకేజీ కింద పనులు చేపడుతున్నారు. అవసరమైన 500 హెక్టార్ల భూమిలో 85.102 హెక్టార్ల భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది. తక్కిన 414.898 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. ఈ విస్తరణలో సుమారు 600 ఇళ్లు కూడా పోనున్నాయి. వీటి పరిహారంపైనే ఇప్పుడు ఆందోళన నడుస్తోంది.
2014 అంచనాల ప్రకారమే పరిహారం
2014 అంచనాల ప్రకారమే ఇప్పుడు పరిహారం ఇచ్చే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2014లో మొదటి దపా రహదారి మంజూరైన సమయంలోనే భూ సర్వే పూర్తయ్యి ఉండటంతో అప్పటి భూమి విలువ ప్రకారమే ఇప్పుడూ పరిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారమే జాతీయ రహదారి సంస్థ రూ.156 కోట్లను మంజూరు చేసింది. అయితే ఇప్పుడు నిర్వాసితులు మాత్రం ఇప్పటి భూమి విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
వి.శివారెడ్డి, 544-డి రోడ్డు నిర్వాసితుల కన్వీనర్‌.

జాతీయ రహదారి కింద భూములు ఇళ్లు, కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలి. భూమి కోల్పోతున్న రైతులకు సెంటుకు కనీసం రూ.50 వేలు ఇవ్వాలి. 2023 ధరల ప్రకారం ఇళ్లకు పరిహారం చెల్లించాలి. 2013 భూసేకర చట్టం ప్రకారం పరిహారమివ్వాలి దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే బాధిత రైతులు, ప్రజల పక్షాన పోరాటం సాగిస్తాం.