అనంతపురం ప్రతినిధి : హంద్రీనీవా మొదటి దశ కింద ఆయకట్టుకు నీరు కలగానే మిగిలిపోతోంది. 2012 నుంచి ఏటా శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరొస్తూనే ఉంది. దశబ్ధకాలం దాటినా మొదటి దశ కిందనున్న ఆయకట్టుకు నీరందించే పంటకాలువల నిర్మాణం మాత్రం పూర్తవలేదు. ఇప్పటికీ భూసేకరణ వద్దనే ఆగిపోయి ఉంది. మరోవైపు కొత్తగా ఈ ప్రాజెక్టు కింద నీటి కేటాయింపులు పెరిగిపోతూనే ఉన్నాయి. కాని ప్రాజెక్టు రూపకల్పన సమయంలోనే నిర్ణయించిన ఆయకట్టుకు నీరందించే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.
మొదటి దశ కింద 1.18 లక్షల ఆయకట్టు ప్రతిపాదన
హంద్రీనీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రాజెక్టు రూపకల్పన సమయంలోనే నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుతోపాటు పంటకాలువల నిర్మాణం చేపట్టాలన్నది లక్ష్యం. మొదటి దశ కింద శ్రీశైలం మాల్యాల నుంచి జీడిపల్లి వరకు ఉంటుంది. ఇంతదూరం వరకు 2012వ సంవత్సరం నుంచి నీటిని తీసుకొస్తూనే ఉన్నారు. సగటున 20 టిఎంసిలకుపైగానే నీరు ఏటా వస్తోంది. పంట కాలువల నిర్మాణం చేపట్టేందుకుగానూ ప్యాకేజీ 33, 34, 36-ఎ, 368 ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రధానంగా ఉరవకొండ ప్రాంతంలోనే సాగునీటిని అధికంగా అందించేందుకు వీలుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే హంద్రీనీవా కింద కలిపి మొత్తం రూ.917 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా రూపొందించారు. ఈ నిధులు విడుదలయిన తరువాత భూసేకరణ చేపట్టాక పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఇది పూర్తవుతున్నది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా కళ్లేదుటే నీరు పోతున్నా ఆయకట్టుకు వాడుకోలేని పరిస్థిత రైతుల్లో నెలకొంది. దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో గతంలో పెద్దఎత్తున ఆందోళనలు సైతం నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉండగా వైసిపి నాయకులు సైతం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాని అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దీనిపై కదలిక లేదు.
ఆయకట్టుకు నీరివ్వాలి
చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎపి రైతు సంఘం.
హంద్రీనీవా మొదటి దశ కింద ఆయకట్టుకు నీరందించే పంటకాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. ఇది పూర్తయితే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇప్పటికే దశబ్ధకాలంగా నీరున్నా రైతులు వాడుకోలేని దయనీయ స్థితి నెలకొంది. బడ్జెట్‌లో నిధులను కేటాయించి పంటకాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అది చేసినప్పుడే ప్రాజెక్టు అసలు లక్ష్యం నెరవేరినట్టవుతుంది.










