Apr 22,2023 21:08

విద్యుత్‌ శాఖ ఎస్‌ఇకి వినతిపత్రం అందజేస్తున్న అనంత వాటర్‌ ప్లాంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి - అనంతపురం        సాధారణ ప్రజలు ఒక నెల విద్యుత్‌ బిల్లు చెల్లించటం ఆలస్యం అయితేనే అధికారులు సరఫరా నిలిపి వేస్తారు. అయితే తమకు కావాల్సింది అందితే చాలు ఇక నిబంధనలు తరువాయి అన్న చందంగా కొందరు అధికారుల తీరు వుండడంతో యావత్తు విద్యుత్‌ శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటన ఇటీవల స్వయానా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు మాత్రం శూన్యం. వివరాల్లోకి వెళ్తే.. వేసవి కావటంతో శుద్ధజలం వ్యాపారానికి డిమాండ్‌ పెరిగింది. అయితే ఇదే అదనుగా నీటి వ్యాపారం చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగింది. సాధారణ సమయంలో కన్నా నాలుగింతలు వ్యాపారం పెరిగింది. అనంతపురం, పరిసర ప్రాంతాల్లో సుమారుగా 300 నీటి శుధ్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటి అనుమతుల నిబంధనలు అటుంచింతే కనీస పరిమితులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మరో వైపు విద్యుత్‌ అధికారుల అండతో బల్లకింద చేతులు తడిపి వ్యాపారం చేసే వారు అధికమవుతున్నారు. సాధారణంగా నీటి శుద్ధి కేంద్రాలను విద్యుత్‌ శాఖ కమర్షియల్‌ రంగంగా పరిగణలోకి తీసుకుని క్యాటగిరి 2 గా గుర్తించింది. ఆజాద్‌ నగర్‌లోని ఓ ప్లాంట్‌ యాజమాని అధికారులకు బాగానే పైసలు ముట్టచెప్పినట్లు వినికిడి. అయితే కొందరు వ్యాపారులు రాజకీయ, అంగ బలంతో నిబంధనలు మరుగున పెట్టి క్యాటగిరి 3గా బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయానా అనంత వాటర్‌ ప్లాంట్‌ అసోసియేషన్‌ సభ్యులు విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయంలో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో ప్లాంట్ల యాజమానులు విద్యుత్‌ శాఖ కళ్లుగప్పి వ్యవహరిస్తుండడంలో ఆంతర్యం అర్థంకావడం లేదు. ఇటప్పటికైనా విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి నిబంధనలను అందరికీ ఒకే విధంగా అమలు చేస్తారా లేదా చూడాల్సివుంది.