- హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్ఎండీ షఫీ
ప్రజాశక్తి-ఉరవకొండ : వడదెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ యస్ఎండి షఫీ పేర్కొన్నారు. ఉరవకొండ మండల పరిధిలోని రాకెట్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వేసవికాలంలో తగిలే వడదెబ్బపై రాకెట్ల పిహెచ్సి హెల్త్ ఎడ్యుకేటర్ షఫీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుతుండడం వలన ఆరుబయట ఆడుకోవడం,ఎండలో తిరగడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. కావున విద్యార్థులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే చెప్పులు ధరించి, టోపి గాని రుమాలు ధరించి లేదా గొడుగు తీసుకుని వెళ్లాలన్నారు. పలుచటి నూలు దుస్తులు ధరించాలని,నల్లటి దుస్తులు ధరించారాదని తెలిపారు.ఎవరైనా ఎక్కువ సమయం నేరుగా ఎండలో పనిచేస్తే వడదెబ్బ సోకే ప్రమాదం ఉందని తలనొప్పి,తలతిరగడం,అధిక జ్వరం నీరసం, నాలుక ఎండిపోవడం మగతగా ఉండడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలని గుర్తించి జాగ్రత్తలు పాటించాలని,ఎవరిలోనైనా వడ దెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే అతనికి నీడపాటున చేర్చి దుస్తులు వదులుగా చేసి విసన కర్రతో విస్తూ వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఉష్ణోగ్రత తగ్గేవరకు తడిగుడ్డతో వొళ్ళంతా తుడవాలని తెలిపారు. ఓఆర్యస్ ద్రావణం, కొబ్బరి నీరు మజ్జిగ నీరు ఎక్కువగా తీసుకోవాలని, కూల్ డ్రింక్స్,మసాలా పదార్థాలు తీసుకోరాదని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగరాజు, సీఓ భగవాన్ దాస్, ఉపాధ్యాయులు గోపాల్, రజనీ కుమారి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










