Oct 03,2022 16:34

ప్రజాశక్తి-గంగవరం : 75 ఏళ్ల భారతదేశంలో కుల వివచత ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. జాతి, కుల వ్యవస్థ మారితేనే సమ సమాజం రూపాంతరం చెందుతుందని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అన్నూరు ఈశ్వర్  పేర్కొన్నారు. అందులో భాగంగా  గంగవరం మండలం గండ్రజుపల్లి పంచాయతీకి చెందిన మరిమాకుల పల్లి గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నూరు ఈశ్వర్, గృహ ప్రవేశ కమిటీ వ్యవస్థాపకులు డాక్టర్ శివప్ప మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించి అస్పృశ్యత రహిత దేశంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని జాతి, కుల వ్యవస్థ భారతదేశంలో విస్తారంగా వ్యాపించిందని సూచించారు. జాతి కుల వ్యవస్థ నుండి అనేక ఇబ్బందులు అవమానాలకు గురైన దళితులు మూడు వేల సంవత్సరాలుగా ఇతర వర్గాలకు చెందిన ఇల్లు, దేవాలయాలు,  మఠాలకు, ఆరు బయటనే గడపాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని రూపుమాపడానికి నాటి మేధావులైన, బుద్ధుడు, వేమన, అంబేద్కర్, వీరబ్రహ్మేంద్ర, కైవారం నారాయణ, జ్యోతిరావు పూలే, మహాత్మ గాంధీ, మొదలైనవారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. పాత సంప్రదాయాలు, వలన గ్రామీణ దళితులు అంటరాని తనానికి, అవమానాలకి గురవుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. అందుకే గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ అమానవీయమైన, అస్పృశ్యతా అనే సామాజిక పిడుగును అంతమొందించడానికి ప్రతి ఒక్కరు అస్పృశ్యత రహిత భారత నిర్మాణం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అటు పిమ్మట గ్రామంలో రెడ్డిశేఖర్ యాదవ్ కుటుంబంలోకి  అదే గ్రామానికి చెందిన దళిత మంగమ్మ కుటుంబంని మరియు మరికొంత మంది దళితులను రెడ్ శేఖర్ దంపతులు వారికి రోజా పూలు ఇచ్చి సాధారణంగా వారి ఇంటిలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు దళితులను మా ఇంటిలోకి ఆహ్వానించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ఆపదలో ఉండి రక్తం కావాలంటే అప్పుడు ఏ కులము, ఏ మతము అని అడగరు. అలాంటిది ఆపదలో ఉన్నప్పుడు లేని కులo వారు ఇంటిలోకి వస్తే కులం అడ్డు వస్తుందా అని అన్నారు. దళిత కుటుంబానికి చెందిన మంగమ్మ, కుటుంబ సభ్యులు రెడ్డిశేఖర్ అన్న అంటే నా అన్న ఇల్లు అనుకుని వచ్చి, అన్నం తిని, టీ తాగినందుకు గర్వంగా ఉందని అన్నారు. నన్ను చూసి ఇంకా కొంతమంది ఇలాంటివి కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. సిఐటియు నాయకులు గిరి, పండిత్ ముని వెంకటప్ప, సుబ్బు విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.