అనంతపురం : 'అవును నేను తోపునే... మీ హయంలో చేయలేని పనులను నేను చేసి చూపించాను.' అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్లు ఆస్తులున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించడాన్ని తప్పుబట్టారు. తనకు రూ.20 కోట్లు డబ్బులిస్తే తక్కిన రూ.1980 కోట్లు వారికి రాసిచ్చేస్తాను అను రిజిస్ట్రేషన్ బాండ్ పేపరుపై సంతకాలు చేశారు. దీన్ని వారికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రాజెక్టులపై చంద్రబాబు నాడు పర్యటన అనంతరం ఆయన స్పందించారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల్లో దోచుకున్నది చంద్రబాబునాయుడు అని ఆరోపించారు. హంద్రీనీవా రెండో విడతలో 3, 4,5 ప్యాకేజీ మిగులు పనులు రూ.100 కోట్లు ఉంటే రూ.600 కోట్లకు అంచనాలు పెంచి దోచుకున్నారని మండిపడ్డారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేల కోట్ల పనులను రూ.60 వేల కోట్లకు అంచనాలు పెంచి దోచుకున్నారన్నారు. పేరూరు పెన్నా నది నుంచి నీరు తీసుకురావచ్చునని చెప్పినా పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తూనే అదే రకంగా ఇచ్చి చూపించామని చెప్పారు. సహకార అమ్మ డెయిరీని ఏర్పాటు చేసి పాడి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టామని వివరించారు. పేదలకు చదరపు అడుగు రూ.800 చొప్పున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తున్నామని తెలిపారు. మీ హయంలో రెండు వేల వరకు తీసుకున్నారని విమర్శించారు. ఇవన్నీ చేసిన తోపును తానేని చెప్పారు. రెండు వేల కోట్లు దోచుకున్నట్టు చంద్రబాబునాయుడు ఆరోపించారని గుర్తు చేశారు. రూ.20 కోట్లు ఇచ్చి ఆ ఆస్తులన్నీ మీరే తీసుకోవచ్చునని సవాల్ విసిరారు. రహదారు వెంట భూములున్నది తమకు కాదని, పరిటాల సునీతకేనని చెప్పారు. దొంగదెబ్బతీయాలంటూ టిడిపి నేతలను పరోక్షంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టులో చదివించి వారిని ఫ్యాక్షనిస్టులుగా మారుస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని చెప్పారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయంలోనే ఈ ప్రాజెక్టుల రూపకల్పన, పనులు సాగాయన్నారు. జీడిపల్లి తాను పూర్తి చేసినట్టు చంద్రబాబు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. వారు అధికారంలోకి వచ్చే నాటికే నాలుగుసార్లు జీడిపల్లికి నీరిచ్చియున్నారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడుకు వయసుతోపాటు బుద్ది మందగించిందని మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకావమే లేదని విమర్శించారు.










