
* మృతి చెందిన ఉద్యోగిపై నెపం నెట్టేస్తున్న పాలకవర్గం
* పాలక పెద్దపై రైతుల అనుమానం
* అధికారుల మౌనంపై అనేక సందేహాలు
బూర్జ పిఎసిఎస్‌లో జరిగిన నిధుల అవకతవకలపై రైతుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాము తీసుకున్న లోన్ డబ్బులు, వడ్డీ సొమ్ము జమ సొసైటీలో జమకాకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు నేరుగా సొసైటీకి వెళ్లి డబ్బులు కట్టడమో లేక గతంలో సిఇఒగా పని చేసిన శాస్త్రి చేతికి ఇచ్చేయడమో చేశారు. కొద్ది రోజుల తర్వాత రసీదులు అడిగితే ఎక్కడి వెళ్లిపోతాం, రసీదులు ఇస్తామంటూ సిఇఒ బదులివ్వడంతో రసీదులకేముందంటూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం ఆ సొమ్ము ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. లక్షలాది రూపాయాల సొమ్ము ఎవరు స్వాహా చేశారన్న చర్చ బూర్జ మండలంలో జోరుగా సాగుతోంది.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, బూర్జ : బూర్జ పిఎసిఎస్ పరిధిలో ఇప్పటివరకు రూ.13 కోట్లు బకాయిలు ఉండగా, రూ.9 కోట్ల వరకు వసూలైంది. ఇందులో రైతులు తాము తీసుకున్న అప్పు, దానికి సంబంధించిన వడ్డీ సొమ్ము చెల్లించినా ఇంకా రుణంగానే చూపుతున్న సొమ్ము ఎంత ఉందనేది గ్రామాల్లోకి వెళ్లి పరిశీలిస్తేగాని తెలిసే పరిస్థితి లేదు. వడ్డీ, లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపుల కోసం సిఇఒ పైడిమర్రి శాస్త్రి ఇళ్లకు వచ్చి వసూలు చేసేవారని రైతులు చెప్తున్నారు. అంతా ఆయకే ఇచ్చేవారమని అన్ని గ్రామాల్లోనూ అదే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది జూలైలో శాస్త్రి మృతి చెందడంతో బకాయిల బాగోతం బయట పడింది. దీంతో తమ సొమ్మంతా శాస్త్రి తినేశారని రైతులు అనుకుంటున్నారు. డిసిసిబి అధికారులు మాత్రం ఇందులో నిజం లేదని, శాస్త్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సందర్భంలో కొంత మంది చందాలు వేసుకుని వైద్య ఖర్చులు భరించారని అధికారులు అంటున్నారు. రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును దాచే పరిస్థితి ఉంటే వైద్య ఖర్చుల కోసం అందరిని అడగాల్సిన దుస్థితి ఎందుకొస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
వెనుకుండి కథ నడిపింది సొసైటీ పెద్ద మనిషేనా?
సిఇఒ శాస్త్రి అంత పెద్ద మొత్తాన్ని వెనకేసుకున్నారంటే ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు. సొసైటీ పెద్దలెవరో స్వాహా చేసి ఉంటారని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చనిపోవడంతో సొసైటీ పాలవర్గం, ఉద్యోగులు అందరూ కలిసి అవకతవకలను ఆయనపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్లెన గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాలచంద్ర మౌళీశ్వరరావు రూ.2 లక్షల రుణం తీసుకునేందుకు ఈ ఏడాది మేలో రూ.28 వేలు షేర్ క్యాపిటల్‌గా కట్టారు. సిబ్బంది ఎవరికైనా ఇస్తే జమ అవుతుందో? లేదోనని స్వయంగా తానే చైర్మన్ బగాది నారయణమూర్తికి అందించినట్లు ఆయన చెప్తున్నారు. ఇదిగో అదిగో లోన్ అంటూ కొద్ది రోజులు నాన్చి డబ్బులు ఏమయ్యాయో తెలియదు, తర్వాత వసూలు చేసి ఇస్తామని చైర్మన్ చెప్పడంతో షేర్ క్యాపిటల్ కింద మరోసారి రూ.28 వేలు ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన గొర్లె కృష్ణమూర్తి నాయుడి అదే షేర్ క్యాపిటల్ ఇచ్చారు. వీళిద్దరూ చైర్మన్‌కు డబ్బులు ఇచ్చినా అవి మాయం కావడంపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.