
* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - జలుమూరు: స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్... ఇలా ప్రతిదాంట్లో అక్రమాలకు పాల్పడడం వల్లే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలంలోని చల్లవానిపేటలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేరనడానికి చంద్రబాబే పెద్ద ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబు జైలుకెళ్లడానికి జగనే కారణమంటూ టిడిపి నాయకులు పచ్చి అబద్దాలు చెప్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లతో ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచారని కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. అందువల్లే మళ్లీ సిఎంగా జగనే కావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారన్నారు. ప్రజాభిమానాన్ని ఇంతటి స్థాయిలో పొందిన జగన్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా మోసగించిన టిడిపిని 2019లోనే ప్రజలు తిరస్కరించారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి తిరస్కారం తప్పదన్నారు.