Sep 12,2023 22:02

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ మురళీకృష్ణ

*మహాత్మాగాంధీ కేన్సర్‌ ఆస్పత్రి ఆంకాలజీ ప్రొ.మురళీకృష్ణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌:
అవగాహనతోనే కేన్సర్‌ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించవచ్చని మహాత్మాగాంధీ కేన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్జికల్‌ అంకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణ అన్నారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు కేన్సర్‌పై రెండు రోజుల అవగాహన కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిహెచ్‌సి వైద్యాధికారులు కేన్సర్‌పై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల సకాలంలో వైద్యం పొందలేక ప్రాణాపాయానికి గురవుతున్నారని తెలిపారు. కేన్సర్‌ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, అనుమానాస్పద కేసులను ప్రతి సోమవారం రిమ్స్‌ ఆస్పత్రికి పంపించాలన్నారు. మహాత్మాగాంధీ కేన్సర్‌ ఆస్పత్రి వైద్యులు పి.వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యాన నాలుగు కౌంటర్‌ (సర్జికల్‌ ఒపి) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నోటి, లంగ్‌, గర్భాశయ, బోన్‌ కేన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చని చెప్పారు. సదస్సులో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఎడిఎంహెచ్‌ఒ అనురాధ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ పి.ప్రకాశరావు, జిల్లా మాస్‌ మీడియా అధికారి పి.వి రమణ తదితరులు పాల్గొన్నారు.