Aug 21,2023 21:59

శాలువాలు, హాట్‌బాక్సులను వెనక్కు ఇచ్చేస్నున్న మున్సిపల్‌ కార్మికులు

       అనంతపురం కార్పొరేషన్‌ : 'ప్రజల ఆరోగ్యం, వసతుల కోసం మా ప్రాణాలను ఫణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నాం... ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తమ సేవలను గురించకపోగా, అవమానించేలా వారి చర్యలు ఉన్నాయి... స్వాతంత్ర దిన్సోవం రోజున అవార్డులకు తమను ఎంపిక చేయకుండా కేవలం కార్యాలయం బయట శాలువాలు, హాట్‌బాక్సులు ఇచ్చారు... ఇది నిజంగా కార్మికులను అవమానించడమే... ఇలాంటి బహుమానాలు మాకు అక్కర్లేదు'.. అని అనంతపురం కార్పొరేషన్‌ మున్సిపల్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు ఇచ్చిన హాట్‌బాక్సులు, శాలువాలను వారికే వెనక్కు ఇచ్చేశారు. సోమవారం నాడు అనంతపురం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సావిత్రిని సిఐటియు మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు కలిసి వారి సమస్యలు, అధికారులు వ్యవహరించిన తీరును తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవం నాడు కలెక్టర్‌ చేతులు మీదుగా అందజేసే అవార్డులకు కార్మికులను ఎంపిక చేయకుండా, కమిషనర్‌ భాగ్యలక్ష్మి అవమానించారన్నారు. అవార్డులు ఇవ్వకుండా కార్యాలయంలో హాట్‌బాక్సులు కార్మికులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంరం శ్రమిస్తున్న కార్మికులను ప్రభుత్వ అవార్డుకు ఎంపిక చేయకపోవడం వారిని అవమానించడమే అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేసిన కార్మికులను గుర్తించకపోవడం దుర్మార్గం అన్నారు. కార్మికులకు బకాయి ఉన్న తొమ్మిది నెలల ఈపీఎఫ్‌ నగదును వెంటనే వారి ఖాతాల్లో జయ చేయాలన్నారు. దీనిపై దాదాపు 50 సార్లు స్పందనలో వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. 60 సంవత్సరాల పేరుతో తొలగించిన 12 మంది ఇంజినీరింగ్‌ కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. అనారోగ్యం, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐలలో ఉన్న తప్పులను సవరించి కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. కార్మికులపై అధికారుల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్వాతంత్ర దినోత్సవం రోజున సన్మానం పేరుతో వారిచ్చిన శాలువాలు, హాట్‌బాక్స్‌లను వెనక్కు ఇచ్చేశామన్నారు. అనంతరం సమస్యల పరిష్కారంపై ఈనెల 24వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి కార్మికులంతా తరలి వెళ్తున్నట్లు కమిషనర్‌ భాగ్యలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.