ప్రజాశక్తి- అనంపురం కలెక్టరేట్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండిస్టియల్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సింగిల్ విండో పోర్టల్ నందు జనవరి, ఫిబ్రవరి మాసంలో 110 దరఖాస్తులు రాగా అందులో 93 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించబడ్డాయన్నారు. మిగిలిగిన 17 దరఖాస్తులను కూడా పెండింగ్ లేకుండా గడువు తేదీ లోపల ఆమోదించాలని జిల్లా కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, భూగర్భ జల శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్న బడుగు వికాసం కింద జిల్లాలో 42 యూనిట్లకు రూ.651.63 లక్షల సబ్సిడీ మంజూరుకు ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డిఎం నాగరాజారెడ్డి, డిసిఐఎఫ్ కేశవులు, ఎఫ్‌ఎపిసిసిఐ శేషాంజనేయులు, ఎఫ్‌ఎపిఎస్‌ఐఎ నాగరాజు, ఎపిఐఐసి జెడ్‌ఎం మురళీమోహన్, ఎపిఎష్‌ఎఫ్‌సి బ్రాంచి మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలలో పురోగతి సాధించాలి
గృహ నిర్మాణాలలో పురోగతి సాధించాలని, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని విసి హాల్ నుంచి ఇళ్ల నిర్మాణాలపై ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు, క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలలో ఆశించినంతగా పురోగతి లేదన్నారు. నాట్ స్టార్టెడ్ నుంచి బిబిఎల్ స్థాయికి, బిబిఎల్ నుంచి బిఎల్ స్థాయికి, రూఫ్ లెవెల్ నుంచి ఆర్సీ స్థాయికి వచ్చేలా ఇళ్ల నిర్మాణంలో వెంటనే పురోగతి చూపించాలన్నారు. స్టేజి అప్డేట్లు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఆయా మండలాల వారీగా ప్రతివారం కేటాయించిన లక్ష్యాలలో 50 శాతం కూడా చేరుకోవడం లేదని కలెక్టర్ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడం లేదన్నారు. ఈ విషయమై ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమినిటీలతో నిత్యం సమీక్షిస్తూ పురోగతిలోకి వచ్చేలా చూడాలన్నారు. ఏప్రిల్, మే మాసాలలో మాత్రమే పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు. అధికారులు సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకుని వారం, వారం, కేటాయించిన లక్ష్యాలను పూర్తిగా చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ కేశవనాయుడు, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డి, ఎపి ఎస్‌పిడిసిఎల్ ఎస్‌ఇ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.










