ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని ఆటో రుసుమును రద్దు చేయాలని పుత్తూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముని రాజా, నగరి నియోజకవర్గ కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు రెక్కాడితే గానీ.. డొక్కాడని పరిస్థితి. అలాంటిది వారిపై మున్సిపల్ అధికారులు ఒకపక్క టెండర్ రూపంలో ఆటో రుసుమును వసూలు చేయడం దారుణమన్నారు. బాడుగలు లేక ఈఎంఐలు కట్టలేక డీజిల్ రేట్లు భరించలేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికుల నుండి మున్సిపల్ అధికారులు గేట్ రూపంలో రుసుమును వసూలు చేయడాన్ని వారంతా వ్యతిరేకించారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పుత్తూరు, నగరి నందు రుసుమును వసూలు చేయడం ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిందని వారు అన్నారు. పుత్తూరు మున్సిపల్ డి ఈ వచ్చి టెండర్‌ను వాయిదా వేయడం జరిగిందని, తదుపరి టెండర్ నందు మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ధర్నాను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఆటో వర్కర్స్ నాయకులు రమేష్, శివ, బలరాం, సురేష్, చిరంజీవి, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










