May 16,2023 22:00

కలెక్టరేట్‌ వద్ద చిప్పచేతపట్టుకుని నిరసన తెలుపుతున్న ఆటో కార్మికులు

         అనంతపురం కలెక్టరేట్‌ : ఆటో కార్మికులపై అపరాధ రుసుం విధింపుల పేరుతో పోలీసులు చేస్తున్న వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భగత్‌సింగ్‌ ఆటో కార్మికుల యూనియన్‌, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ట్స్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు వద్ద మండుటెండలో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వేధింపులు కొనసాగితే ఆటో కార్మికులు రోడ్లపై చిప్పపట్టుకుని అడుక్కునే దుస్థితి ఏర్పడుతుందంటూ చిప్పలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సహాయం లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం నగరంలో ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. 2019 కరోనా మొదలైనప్పటి నుంచి ఆటో డ్రైవర్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో కొద్ది మందికి మాత్రమే రూ. 10 వేలు ఇచ్చి సంవత్సరానికి ఈ చలానా రూపంతో వేల రూపాయలు ఆటో కార్మికుల నుంచి పోలీసులు బలవంతంగా లాక్కుంటున్నారని తెలిపారు. పోలీసులు ఇ-చలానాల పేరుతో ఇప్పుడు కొత్తగా పెట్టి 290 కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిమానాల రూపంలో వేల రూపాయలు వేస్తూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నగరంలో పార్కింగ్‌ స్థలాలలో నిలిపిన ఆటోలకు కూడా ఆటో డ్రైవర్లతో సెల్‌ఫోన్‌లు లాక్కొని, పోలీసు స్టేషన్‌కు రమ్మని దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరికావన్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్‌ అధికార యంత్రాంగం ఇ-చలానాలు రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఒ బి.గాయత్రిదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శులు ముత్తుజ, వెంకటనారాయణ, భగత్‌ సింగ్‌ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, శివప్రసాద్‌, నాగరాజు, ఆదినారాయణ, ఆజాం, గఫూర్‌, ఇర్ఫాన్‌, నాగేంద్ర, శ్రీనివాసులు, ముత్తుజ ఆటో కార్మికులు పాల్గొన్నారు.