ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ కరుగుంట నుంచి అనంతపురం పట్టణంలోకి వచ్చే ఆటోలు ప్రయాణికుల నుంచి రూ.20 మాత్రమే వసూలు చేయాలని, అంతకు మించి వసూలు చేయరాదని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిసిఆర్.దాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం కురుగుంట వద్ద రహదారిపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. కురుగుంట నుంచి ఆటోలో ప్రయాణించే వారి నుంచి రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. గతంలో టవర్‌క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ఆటోలు చుట్టు తిప్పుకుంటూ వచ్చే క్రమంలో రూ.30 వసూలు చేశారన్నారు. ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభమైనా కూడా ఆటో డ్రైవర్‌లు రూ.30 వసూలు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. కాలనీల్లో రెక్కల కష్టంపై ఆధారపడి రోజూ దూర ప్రాంతాలకు ఆట్లో ప్రయాణించి పనులు చేసుకుని ఇళ్లకు వస్తుంటారని తెలిపారు. అలాంటి కార్మికులు, శ్రామికులు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆటో చార్జీలు రూ.20 మాత్రమే తీసుకునేలా అధికారులు ఆటో డ్రైవర్‌లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నబిరసూల్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగయ్య, కాలనీవాసులు బాషా, ఓబుళపతి, ఈశ్వరయ్య, రామనాగేశ్వరరెడ్డి, కుళ్లాయప్ప, నాగరాజు, బాలరాజు, శంకర్ పాల్గొన్నారు.
కురుగుంట హైవేపై ప్రజల రాస్తారోకో










