
* ఉత్తరాంధ్ర పేరుతో అవమానిస్తే మంత్రులు స్పందించరా?
* ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రణస్థలం మండలం నారువకు చెందిన టిడిపి అభిమానులు శ్రీకాకుళం నుంచి కుప్పంకు చేపట్టిన సైకిల్‌యాత్రను మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకొని బెదిరించడాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తప్పుపట్టారు. ఉత్తరాంధ్ర పేరుతో అవమానించి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతం పేరుతో దూషించడం, నడిరోడ్డు పైనే బట్టలు విప్పించడం అమానుషమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చేసిన ఈ దాడి, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసే విధంగా ఉందని ఆక్షేపించారు. ప్రాంతాలు, సంస్కతులు, యాస వేరైనా అందరిదీ తెలుగు భాషే అని అన్నారు. ఆత్మీయత, గౌరవ మర్యాదల్లో మన రాష్ట్రానిది ఎప్పుడూ అగ్రస్థానమేనని గుర్తుచేశారు. ప్రాంతాల పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్న వైసిపి మంత్రులు, నాయకులు.. విశాఖలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఏం సమాధానం చెప్తారన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తులను ప్రాంతం పేరుతో అవమానిస్తే జిల్లాకు చెందిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధిత టిడిపి నాయకులకు క్షమాపణలు చెప్పాలని, వారిపై అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.