నాలుగేళ్లుగా మొండిగోడలే దర్శనం
టిడిపివనే నెపంతో నిధులివ్వని వైనం
పూర్తిచేయడంపై ప్రభుత్వం మీనమేషాలు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
. అయితే ప్రస్తుత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 'నవరత్నాల' బాకా తప్ప ఏమీ పట్టడం లేదన్న విమర్శలున్నాయి. నాలుగేళ్ల క్రితం టిడిపి హయాంలో అసంపూర్తిగా ఉన్న 'టిడ్కో' ఇళ్లను ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడంతో మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. నిధులు కేటాయిస్తే ఎక్కడ టిడిపికి పేరు వస్తుందోనని వాటిమాటే పట్టించుకోలేదు. దీంతో నాలుగేళ్లుగా మొండిగోడలతోనే దర్శనమిస్తున్నాయి. ఎప్పటికైనా ఇల్లు ఇస్తారన్న ఆశతో లబ్దిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
అర్బన్ వాసులకు ప్రత్యేకం
అర్బన్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో స్థలా భావం కారణంగా వీటిని అపార్టు మెంటు తరహాలో నిర్మించి ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో సహా అప్పటి వరకు ఉన్న ఐదు మున్సిపాలిటీల్లోనూ వీటిని ప్రారంభించింది. మూడు విభాగాలుగా వీటి నిర్మాణాలను చేపట్టింది. నిరుపేదలకు రూ.500 చొప్పున లబ్దిదారుల వద్ద వాటా కింద కట్టించుకుంది. రెండో విడత నిర్మించిన ఇళ్లకు స్థల విస్తీర్ణాన్ని బట్టి రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు కట్టించుకుంది. నిర్మాణాలకు సంబంధించి స్థలం రెవెన్యూ శాఖ ఆయా అర్బన్ ప్రాంతాల్లో గుర్తించింది. వాటిని నిర్మించే బాధ్యత నాగార్జున కంపెనీకి అప్పజెప్పింది.
17వేల ఇళ్లు మంజూరు
ఈ మార్గదర్శకాల మేరకు జిల్లా వ్యాప్తంగా అప్పట్లో 17,264 మందిని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా శ్రీకాహస్తిలో రాజీవ్‌నగర్‌వద్ద మొదటి విడతలొ 2,912 ఇళ్లు, రెండో విడతలో సోషియల్ వెల్పేర్ వసతి గృహం వద్ద 2,784 ఇళ్లు, చిత్తూరు నగరం మురకం బట్టు వద్ద 3,504, పుత్తూరులో 1008, నగరిలో 528, పుంగనూరులో 2,160, మదనపల్లిలో 2,928, పలమనేరులో 240, తిరుపతిలో 1200 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే 2020లో కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం 6528 ఇళ్లను రద్దు చేసింది. నగరి, పలమనేరు, తిరుపతిలో 1200 ఇళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఇవన్నీ బేస్‌మెంటు కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయని కారణంగా చూపింది. వీటితో పాటు శ్రీకాళహస్తిలో మొదటి విడతలో మజూరు అయిన 768, రెండో విడతలోనివి మరో 864, చిత్తూరులో 672, పుత్తూరులో 576, పుంగనూరులో 624, మదనపల్లిలో 1056 ఇళ్లు రద్దయ్యాయి.
ప్రభుత్వ మొండి వైఖరి
టిడ్కో ఇళ్లను తెలుగుదేశం నిర్మించిందనే ఒకే కారణంతో ఇప్పటి వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. శ్రీకాళహస్తి, మదనపల్లి వంటి ప్రాంతాల్లో కొంత మేరకు పూర్తయినా వాటికి తాగునీరు, రోడ్లు వంటి మౌళిక వసతులు లేకుండా పడున్నాయి. వీటిని పూర్తి చేస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ఇళ్లు ఇవ్వొచ్చు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది.










