Nov 29,2022 21:55

ఆస్తి పన్ను వసూళ్లపై రెవిన్యూ ఇన్సెక్టర్లతో మాట్లాడుతున్న నగర కమిషనర్‌ అరుణ

ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి : కమిషనర్‌
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ :

నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను వసూలు, మదింపు, సవరణలు, కొత్త అసెస్మెంట్ల గుర్తింపు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నగర కమిషనర్‌ డా. జె అరుణ నగరపాలక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం నగరపాలక కార్యాలయంలో రెవిన్యూ అంశాలపై సహాయ కమిషనర్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. అడ్మిన్‌ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అందించిన అసెస్మెంట్ల జాబితాపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వార్డుల వారిగా తనిఖీ చేపట్టాలన్నారు. ఆస్తి పన్నులకు సంబంధించి హెచ్చుతగ్గులను గుర్తించి రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని అర్‌ఐలను ఆదేశించారు. ఇంకా పన్నులు వేయని నిర్మాణాలను గుర్తించి సత్వరం వాటికి పన్నులు విధించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో పన్నుల మదింపులో తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తీసు కుంటామన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయపు పన్ను వసూళ్లు చేపట్టాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్నులపై చట్ట ప్రకారం చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, మేనేజర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, ఆర్‌ఐలు పాల్గొన్నారు.