ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/నర్సరావుపేట/కారంపూడి : ఒక గర్భిణీ ప్రసవం కోసం మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 80 కిలో మీటర్లు ప్రయాణించారు. ఆమెను మూడు గంటల పాటు మూడు ఆస్పత్రులకు తిప్పారు. ఇది ఎక్కడో మారు మాల ప్రాంతంలో జరిగిన ఘటన కాదు... రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని సొంత జిల్లాలోనే. పల్నాడులో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఒంటి వరకు ఒక మహిళ అనుభవించిన దుర్భరపరిస్థితి చివరకు ఆమె భర్త ప్రాణాలనే బలి తీసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల్లేక ప్రజలు అల్లాడుతున్నారని ఈ ఘటన అద్దం పడుతోంది.
ఏళ్లు గడస్తున్నా పల్నాడులో సరైన వైద్య సదుపాయాలులేక వేలాది మంది నిత్యం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు వస్తుంటారు. పల్నాడు జిల్లాలోని ఏ ఆస్పత్రికి వెళ్లినా ఎక్కువ మంది రోగులను జిజిహెచ్‌కు రిఫర్ చేయడం పరిపాటైంది. తాజాగా కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పడిన తరువాత నరసరావుపేటకు ఆస్పత్రికి కొంతమంది రిఫర్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికీ పలు పిహెచ్‌సిలు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాల లేమి కారణంగా ప్రసవాలు కూడా చేయలేకపోతున్నారు. తమకు రిస్క్ ఎందుకులే అని పెద్దాసుపత్రికి పంపిస్తే సరిపోతుందనే ధోరణి గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిలో పెరిగిపోయింది. వైద్య పరంగా ఏదో ఒక సాకు చెబితే రోగి బంధువులు కంగారు పడి అక్కడి నుంచి వెళ్లిపోతారులే అనే భావన పెరిగింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా వారూ ఏమీ చేయలేకపోతున్నారు.
కారంపూడి, గురజాల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ తన భర్తను కోల్పోగా నలుగురు పిల్లలు తండ్రి లేని వారిగా మారారు. భార్యను ప్రసవం కోసం కారంపూడి, గురజాల ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ సౌకర్యాలు లేవని వైద్య సిబ్బంది నరసరావుపేటకు పంపితే డబ్బు కోసం స్వస్థలం కారంపూడి వెళ్లి వస్తానని బంధువులతో భార్యను నర్సరావుపేటకు పంపిన బత్తిన ఆనంద్ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన విషాధ సంఘటన పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేట ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బత్తిన రామాంజికి ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడనే విషయం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలవరపర్చింది. మాటలకందని ఈ విషాధ ఘటన నరసరావుపేట ఆస్పత్రిలో పలువురిని కంటతడి పెట్టించింది. కారంపూడి నుంచి గురజాల వరకు భార్యతో ఉన్న రామాంజి భర్త బత్తిన ఆనంద్ (31) శుక్రవారం అర్ధరాత్రి కారంపూడిలోని ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో జూలకల్లు వద్ద రహదారిపై పెద్ద గుంతలో పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. నరసరావుపేట ఆస్పత్రిలో నాలుగో బిడ్డగా పుట్టిన శిశువును చూసుకోవాల్సిన ఆనంద్ అదే ఆస్పత్రిలో విగతజీవిగా శవగారానికి చేరాడు. భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన ఆనంద్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోదించారు. రామాంజి, ఆనంద్ దంపతులకు ఇప్పటికే తొమ్మిదేళ్ల అఖిల, ఏడేళ్ల అక్షయ, ఐదేళ్ల తరుణ్ ఉన్నారు. శనివారం తెల్లవారుజామున పుట్టిన శిశువు నాలుగో సంతానం. మృతునికి తల్లిదండ్రులతోపాటు ఇద్దరు సోదరులున్నారు. కూలి పని చేసుకుంటూ జీవన సాగిస్తుంటాడు. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలో రహదారుల అధ్వానం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జూలకల్లు వద్ద ఆనంద్ ప్రమాదానికి గురవడానికి రహదారి అధ్వానం కూడా మరో కారణం.










