Mar 26,2023 17:38

మెటల్‌ వేసి వదిలేయడంతో వాహనదారులు, స్థానికుల అవస్థలు
ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని మొగ ల్తూరు, శేరేపాలెం, కొత్తపాలెం తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రం భీమవరం వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బి రహదారి నిర్మాణ పనులు నిలిచి పోయాయి. మెటల్‌ వేసి వదిలేయడంతో ప్రయాణికులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు.
మొగల్తూరు నుంచి కొత్తపాలెం వరకూ సుమారు నాలుగు కిలో మీటర్లు, భీమవరం గ్రామీణ మండలం పెదగరువు నుంచి జివిఐటి కళాశాల వరకూ 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి సుమారు నాలుగేళ్ల కిందట టిడిపి హయాంలో రూ.12.64 కోట్ల నిధులు మంజూరు చేశారు. తరువాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేసిన రివర్స్‌ టెండర్‌ విధానంలో కూడా పనులు ప్రారంభం కాలేదు. తిరిగి అవే నిధులతో రెండున్నరేళ్లకిందట పనులను ప్రారంభించారు. రహదారిని రెండు వరుసలుగా విస్తరించారు. అయితే తారురోడ్డు నిర్మించాల్సి ఉండగా మెటల్‌ రోడ్డు వేసి చేతులుదులుపుకున్నారు. ప్రస్తుతం రహదారిపై రాళ్లు పైకిలేచి అధ్వానంగా తయారైంది. వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము రేగి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రహదారిపై గుంతలు..
కొత్తపాలెం నుంచి వెంప వరకూ సుమారు 2 కిలోమీటర్ల మేర ఉన్న ఆర్‌అండ్‌బి రహదారి పూర్తిగా ధ్వంసమైంది. నిత్యం ఈ రహదారి గుండా వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. ధ్వంసమైన రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఈ రహదారికి మరమ్మతులైనా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..
నిక్కీక్రజ్‌, ఆర్‌అండ్‌బి ఇన్‌ఛార్జి ఎఇ. మొగల్తూరు
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు తగు చర్యలు చేపడతాను. కొత్తపాలెం- వెంప గ్రామాల మధ్య ఉన్న రహదారి మరమ్మతు పనులను కూడా తొందరలోనే చేపడతాం.