ప్రజాశక్తి-నెల్లూరు :అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి 'ప్రజారక్షణ బేరీ' పేరుతో బస్సు యాత్రలు ప్రారంభమవుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో 'ప్రజారక్షణ బేరి' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 29, 30 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్ జిల్లా ఆదోని ప్రాంతాల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమౌతాయన్నారు. ఒక ప్రాంతంలో బస్సు యాత్రను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు , మరో ప్రాంతంలో ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తుందన్నారు. నగరానికి 4వ తేదీన ఈ బస్సు యాత్ర చేరుకుంటుందన్నారు. సర్వేపల్లి, ముత్తుకూరు ప్రాంతాల్లో సభా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.5వ తేదీన నగరంలోని విఆర్‌సి సెంటర్‌లో, కోవూరు, కావలి, కందుకూరు ప్రాంతాల్లో సభలు ఉంటాయన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే ప్రకటించిందో విభజన హామీలు నెరవేర్చాలని, ఎపికి ప్రత్యేక హోదా అమలు చేయాలని, రాష్ట్ర ్ట రాజధాని అమరావతిలో నిర్మించాలని, గుంటూరులో హైకోర్టు నిర్మించాలన్న సమస్యలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. స్థానిక సమస్యలు పంచాయితీలకు, కార్పోరేషన్‌కు కేటాయించిన నిధులు ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తుందని, ఈ నేపథ్యంలో పంచాయితీల్లో, కార్పోరేషన్‌లో అభివృద్ది పనులు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ద్య నిర్వహణ తదితర అంశాలు కష్టమైపోతుందన్నారు. వెంటనే ఈ నిధులను ప్రభుత్వం కేటాయించాలన్నారు. పోలవరం నిర్వాశితులకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్న సమయంలో ప్రయివేట్ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నవంబరు 15న చివర విజయవాడలో భారీ స్థాయిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల జిల్లా సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించామని, ఈ పాదయాత్రల్లో తామ దృష్టికి వచ్చిన, గుర్తించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశామన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌భీ మాట్లాడుతూ ప్రజారక్షణ భేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర సిపిఎం నిర్వహిస్తుందని, విద్యుత్తు ఛార్జీల పెంపు వల్ల కలిగే ఆర్ధిక ఇబ్బందులు, గ్యాస్ ధరలు అధుపు చేయాలని, స్కిం వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని , మద్యం మత్తు పదార్ధాలను ప్రభుత్వం చేయాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.మోహన్‌రావు, తుళ్లూరు గోపాల్, ఆలూరి తిరుపాలు, గోగుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










