
* ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి -ఎచ్చెర్ల : అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపడుతున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాత్రను నవంబరు రెండో తేదీన మందసలో సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్ ప్రారంభిస్తారని తెలిపారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యాన మూడు చోట్ల బస్సు యాత్రలు ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అత్యధిక ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపు చేయడం, వంటగ్యాస్ ధర 400, పెట్రోల్, డీజిల్ లీటరు రూ.60కే ఇవ్వడం, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం, మెగా డిఎస్‌సి, నిరుద్యోగ భృతి రూ.ఐదు వేలు, రైతులకు గిట్టుబాటు ధర, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ తదితర హామీలు అమలు వంటి వాటితో కూడిన ప్రజా ప్రణాళికను సిపిఎం ప్రజల ముందుంచుతుందని తెలిపారు. వీటితో పాటు కనీస వేతనం రూ.26 వేలు, స్కీమ్‌వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు అమలు, వృత్తిదారుల ఉపాధి భద్రత, మహిళలకు రక్షణ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్, విభజన హామీల అమలు ప్రజా ప్రణాళికలో ఉన్నాయన్నారు. ఇవి అమలయ్యే విధంగా సిపిఎంను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సమావేశంలో సిపిఎం నాయకులు సిహెచ్.అమ్మన్నాయుడు, టి.నందోడు, పొందూరు చందర్రావు తదితరులు పాల్గొన్నారు.