
సమాజంలోని అసమానతలు ఆధారంగా చేసుకొని, తెరకెక్కించిన చిత్రాలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి. అయితే గతంలో అభ్యుదయ భావాలు, విప్లవం, వర్గ పోరాటం, కులాల చిచ్చు, మతాల మారణహోమం.. వంటి అనేక అంశాలు వెండి తెరపై కథలుగా వచ్చాయి, కదిలించాయి. పీడిత ప్రజల వైపు నిలబడి మాట్లాడిన ప్రతిసారీ జనం జేజేలు పలికారు. కొత్త ఆలోచనల్ని రేకెత్తించిన ప్రతిసారీ హారతులు పట్టారు. అయితే ఇప్పుడు అదే విషయాలపై చర్చను లేవదీసే దిశగా మన ముందుకు వచ్చిన చిత్రం 'అర్ధశతాబ్దం'. అయితే.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడం కత్తిమీద సాము. 'అరశతాబ్దం'లోనూ దర్శకుడు బలమైన విషయాల్నే ఎంచుకున్నాడు. చిత్రం తెరకెక్కించిన తీరు ఎవరిని కదిలించింది? ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే.. ఆహాలో విడుదలైన ఈ సినిమా గురించి కాస్త లోతుగా..
బ్యానర్ : ఆర్‌ఎస్ క్రియేషన్స్
నటీనటులు : కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర,సాయికుమర్, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్, ఆమని తదితరులు
సంగీతం : నఫల్ రాజా
సినిమాటోగ్రఫీ : అస్కర్, వెంకట్ ఆర్ శాఖమూరి, ఈజేవేణు
ఎడిటింగ్ : జె.ప్రతాప్ కుమార్
ఆర్ట్ : సుమిత్ పటేల్
నిర్మాత : చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
కథ,దర్శకత్వం : రవీంద్ర, పుల్లె
ఓటీటి : ఆహా
విడుదల తేదీ : 11, జూన్ 2021
కథలోకి వెళ్తే... అది సిరిసిల్ల గ్రామం 2003వ సంవత్సరం. గ్రామంలో కులాల కట్టుబాట్లతోనే జీవిస్తారు. ఎవరి పని వారే చేయాలనే భావంతోనే ఉంటారు. అక్కడి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవాలని చూస్తుంటారు. ఆ ఊరివాడే కృష్ణ (కార్తీక్ రత్నం). దుబారు వెళ్లి, బాగా సంపాదించి.. అమ్మా, చెల్లెల్ని బాగా చూసుకోవాలన్నది కోరిక. చిన్నప్పటి నుంచీ పుష్ప (కృష్ణ ప్రియ) అంటే చాలా ఇష్టం. తన వెనకే తిరుగుతుంటాడు. కానీ, పుష్ప అతన్ని పట్టించుకోదు.
ఊర్లో బాబారు (గౌతమ్ రాజు) కొట్టు దగ్గర ఓ పూల మొక్క ఉంటుంది. ఆ మొక్కకి పూచిన పువ్వంటే పుష్పకి ఇష్టం. అందుకోసం రోజూ ఆ మొక్క దగ్గరకు వస్తుంటుంది. ఆ మొక్కకి పూచిన పువ్వు కోసి, అది పుష్ప చేతిలో పెట్టి, తన మనసులోని మాట బయటపెట్టాలన్నది కృష్ణ ఆలోచన. అయితే ఈలోగా ఆ పువ్వు ఎవరో కోసుకెళ్లిపోతారు. అదంతా ప్రత్యర్థి వర్గం పనే అనుకుని, కృష్ణ, అతని స్నేహితులు ప్రత్యర్థిపై దాడి చేస్తారు. అది కాస్త కులాల మధ్య కుమ్ములాటగా మారుతుంది. ఊర్లో ఒకరికొకరు నరుక్కునే వరకూ వెళ్తుంది. ఊరంతా రక్తపాతమవుతుంది. అసలు పువ్వుకు, గొడవలకు సంబంధం ఏమిటి..? చివరకు పుష్పకు తన ప్రేమను తెలియజేశాడా? ఇందులో నవీన్ చంద్ర, సాయికుమార్ పాత్రలు ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే !
ఒక పువ్వు వల్ల ఒక ఊరిలో గొడవలు, అనర్థాలు జరుగుతాయనే విషయం ఇంట్రస్టింగే. అయితే దాన్ని ఏ జోనర్‌లో చెప్పామనేది ముఖ్యం. వ్యంగ్యాత్మకంగా కథనం నడిపితే బాగుండేది. విప్లవ భావాలు, వర్గ పోరాటం, శ్రమదోపిడి, కులాల మధ్య గొడవలు అన్నీ ఒకేసారి చూపేయాలనే తాపత్రయంలో తాము కథ, కథనం ఎలా నడుపుతున్నామనే విషయం మర్చిపోయారు. మొదటి అర్ధభాగం అంతా కథ ఏమీ కదలదు. కేవలం పుష్పను కృష్ణ ఇష్టపడటం, చైల్డ్ హుడ్ మెమరీస్‌తో సాగుతుంది. హీరో వన్‌సైడ్ లవ్ పెద్దగా ఆసక్తిగా అనిపించదు. అలాగే అసలు విషయంలోకి రాకుండా కథని సాగతీయటం విసిగిస్తుంది.
పోనీ సెకండాఫ్‌లో అయినా సినిమా పరుగెడుతుందా అంటే అదీ ఉండదు. గొడవలు, అల్లర్లతో నిండిపోయింది. ఆ గొడవల నుంచి ఆ ప్రేమ జంట తప్పించుకోవటం అనేది ఒక్కటే.. మనకు ఈ సినిమా పూర్తిగా చూడాలి అనిపించే ఏకైక ఎలిమెంట్. అంతకు మించి ఏమీ లేదు. అలాగే సెకండాఫ్‌లో హీరో కృష్ణ.. పుష్పను తీసుకొచ్చి, ఎందుకు వీధుల్లో తిప్పుతాడో తెలియదు. ఇలా ఫస్టాఫ్‌లో పసలేని ప్రేమ కథతో అక్కడే తిప్పి తిప్పి కథని సాగదీస్తే, సెకండాఫ్‌లో రన్ టైం తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా సంబంధం లేకుండా సీన్స్ ఎడిట్ చేశారు. దాంతో చాలాచోట్ల లింక్‌లు తెగిపోయాయి. నక్సలిజం, రాజ్యాంగం అంటూ చాలా బలమైన అంశాలు కథలో మేళవించినా, వాటిని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా, అర్థం చేసుకునేలా చెప్పలేకపోయాడు.
మొదటి సినిమాలోనే అనేక విషయాలను చెప్పేయాలనుకోవడం డైరక్టర్‌ని దెబ్బకొట్టింది. మంచి డైలాగ్స్ రాసుకున్నప్పటికీ సీన్‌ని, డైలాగులను కలిపి ఎమోషనల్‌గా ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ప్రేక్షకులని వావ్ అనిపించే సన్నివేశాలు లేకపోవడంతో సినిమా నిరాశపరిచింది.
ఇక హైలెట్స్‌లో వేణు, వెంకట్ ఆర్ శాఖమూరి, అస్కర్ సినిమాటోగ్రఫీ బాగుంది.. 90ల నాటి కథకి సరిపోయే విజువల్స్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ విజువల్స్‌కి నఫల్ రాజా అందించిన మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ యాప్ట్. హీరోగా చేసిన కార్తీక్ రత్నం, తొలిపరిచయమైన కృష్ణప్రియ బాగా చేశారు. కీలక పాత్రల్లో కనిపించిన నవీన్ చంద్ర, సాయికుమార్, అజరు, శుభలేఖ సుధాకర్ బాగా చేసినా, కథలో వారి పాత్రలు కరెక్ట్‌గా డిజైన్ చేయలేదు. చివరగా దర్శకుడికంటూ ఓ భావజాలం ఉందని అర్థమైంది కానీ, అదేంటో ప్రేక్షకుడికి అర్థం కాదు. అదే.. ఈ సినిమాలోని ప్రధాన లోపం.