Sep 19,2023 21:15

సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌

* ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
అసౌకర్యంగా ఉండి అవసరమున్న పోలింగ్‌ కేంద్రాలను మార్చాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. పలు రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌తో కలిసి ఓట్ల తొలగింపులు, చేర్పులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీ నుంచి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలు కొండ ప్రాంతంలో ఉన్నందున ఓటర్లకు అసౌకర్యంగా ఉందని చెప్పగా, పోలింగ్‌ కేంద్రాన్ని మార్చాలంటే ప్రభుత్వ భవనం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల గురించి జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ వివరించారు. శ్యామలాపురం పోలింగ్‌ కేంద్రం ఓటర్లకు సౌకర్యంగా ఉన్నదీ, లేనిదీ తెలియజేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. మెళియాపుట్టి మండలంలో ఏడు పోలింగ్‌ కేంద్రాలు మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తహశీల్దార్‌ తెలిపారు. షిఫ్టింగ్‌ ఓటర్ల గురించి టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి చేర్పులు, తొలగింపులు జరిగాయని, జాబితా కావాలని వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.స్వరూప్‌ కోరారు. సంబంధిత ఇఆర్‌ఒ నుంచి సమాచారాన్ని తీసుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో ఒక పోలింగ్‌ కేంద్రంలో గొడవలు అవుతుంటాయని, ఆ కేంద్రాన్ని మార్చాలని రాజకీయ పార్టీలు కోరగా కొత్త పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలంటే 1500 ఓటర్లు ఉండాలని, ప్రభుత్వ భవనం తప్పనిసరిగా ఉంటేనే పోలింగ్‌ కేంద్రం మార్చడానికి అవకాశం ఉంటుందని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఒలు శాంతి, సీతారామ్మూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళీకృష్ణ, జయదేవి, తహశీల్దార్లు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, బిఎస్‌పి నాయకులు కె.గోవిందరావు, సోమేశ్వరరావు, బిజెపి నాయకులు సీతారాజు తదితరులు పాల్గొన్నారు.