Oct 17,2023 22:05

మాట్లాడుతున్న ప్రసాద్‌, సింహాచలం

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : జిల్లాలో అన్యాక్రాంతమైన 24 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు పేదలకు అప్పగించి, వాటికి హక్కులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సిర్ల ప్రసాదరావు, గంగరాపు సింహాచలం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం 9/77 చట్టాన్ని తీసుకొచ్చినా, జిల్లాలో 24 వేల ఎకరాలు అలా కావడం బాధాకరమని పేర్కొన్నారు. హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో 14,852.61 ఎకరాలు మాత్రమే పేదల వద్ద ఉన్నట్లు నిర్ధారణ చేస్తున్నారని తెలిపారు. ఆ భూములకు మాత్రమే హక్కు పత్రాలు ఇస్తామని అధికారులు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. మిగిలిన 24 వేల ఎకరాల భూములకూ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 9/77 చట్టాన్ని ఉల్లంఘించి అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం చేసి చేపలు, రొయ్యల చెరువులు, రియల్‌ ఎస్టేట్లు తదితర రూపాల్లో వినియోగించుకుంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి సర్వేల్లో వెలుగుచూస్తున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోలు చెల్లవని చట్టం చెప్తున్నా, వేలాది ఎకరాల భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అసైన్డ్‌ భూముల సవరణ చట్టం వల్ల ప్రస్తుతం పేదల సాగులో ఉన్న భూములు పెత్తందారుల పరం కాబోతున్నాయని పేర్కొన్నారు. అసైన్డ్‌ భూముల సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వే చేసిన భూముల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, ప్రజలందరికీ తెలియజేసే విధంగా గ్రామాల్లో దండోరా వేయించాలని కోరారు.