ప్రజాశక్తి-ఉరవకొండ పిహెచ్‌సిల్లో ఆశావర్కర్లకు సంబంధం లేని నైట్ డ్యూటీలు చేయించొద్దని ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి నాగమణి, సిఐటియు జిల్లా నాయకులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండల పరిధిలోని గడేహోతూర్ పిహెచ్‌సిలో ఆశావర్కర్లతో నైట్ డ్యూటీలు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆశావర్కర్ల, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో పిహెచ్‌సి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైట్‌డ్యూటీలు చేయాల్సిన వైద్యసిబ్బంది పిహెచ్‌సిల్లో ఉండకుండా ఆశావర్కర్లను నైట్‌డ్యూటీలు చేయాలని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయించుకునే విధానాన్ని విడిచిపెట్టకపోతే జిల్లాకేంద్రంలో జరిగే స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వైద్యాధికారికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ సంఘం నాయకులు, కార్యకర్తలు, సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వైద్యాధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న ఆశావర్కర్ల యూనియన్ నాయకురాళ్లు










