నాటుసారా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు
ఆరుగురిపై పిడి యాక్ట్
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్:
జిల్లాలో అక్రమంగా నాటుసారా తయారి మరియు విక్రయం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ అనేక కేసులలో నిందితులుగా ఉన్న ఆరుగురిపై పిడి యాక్ట్ ప్రయోగించిన చిత్తూరు ఎస్‌డిపిఒ సుధాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎస్‌డిపిఒ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలో అక్రమంగా నాటుసారా తయారు చేసి, విక్రయిస్తున్న వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకొన్నది. ఈ మేరక పలుమార్లు అనేక కేసులల్లో నిందుతులుగా ఉన్న గుడిపాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడిపాల మండలానికి చెందిన రాజుదొరై, ఆర్.బాబు వెదురుకుప్పం మండలానికి చెందిన చల్లపయన్, కోటగ్రామం ధనపాల్, ఎస్‌ఆర్‌పురం మండలానికి చెందిన ప్రభు, దక్షణామూర్తి అనే నాటుసారా తయారీ, విక్రయదార్లు ఆరుగురిని గుర్తించిన పోలీసు యంత్రాంగం వారిపై పిడి యాక్ట్ ప్రయోగించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించనుంది. ఇదేవిధంగా, గతంలోను చిత్తూరు సబ్‌డివిజన్ పరిధిలోని పాలసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురిపై మరియు గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిపై కూడా పిడి యాక్ట్ ప్రయోగించిన్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారిపై గట్టి నిఘాపెట్టినట్లు, మరికొంత మందిపై కుడా పిడి యాక్ట్ ప్రయోగించడానికి పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉన్నట్లు ఎస్‌డిపిఒ సుధాకర్ రెడ్డి తెలిపారు.










