Dec 02,2022 22:39

రామచంద్ర యాదవ్‌ యువసేన వెల్లడి

ఆరు నూరైనా 'రైతుభేరి' నిర్వహిస్తాం..!
ప్రజాశక్తి -పుంగనూరు

సదుం మండల కేంద్రంలో ఈనెల 4న ఆదివారం రైతుభేరి సభను ఆరు నూరైనా జరిపి తీరుతామని రామచంద్ర యాదవ్‌ యువసేన నాయకులు సాంబమూర్తి , ఆనంద చెప్పారు. పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త బోడే రామచంద్ర యాదవ్‌ యువసేన నాయకులు శుక్రవారం విలేకరుల సమావేశం వారి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుభేరి సభ నిర్వహణపై నియోజకవర్గ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ నాయకులు బోడె రామచంద్ర యాదవ్‌ ఆధ్వర్యంలో సదుం గ్రామంలో రైతుభేరి కార్యక్రమాన్ని తొలుత నవంబర్‌ 28వ తేదీన నిర్వహించుకోవడానికి పోలీసు ఉన్నతాధికా రులను అనుమతి అడిగామని, అయితే తాము అడిగిన వెంటనే సదుం గ్రామంలో నవంబర్‌ 30 వరకూ 30 యాక్ట్‌ అమల్లో ఉందని మీడియా ద్వారా చెప్పారన్నారు. దీంతో తాము సభను వాయిదా వేసుకుని డిసెంబర్‌ 4న ఆదివారం నిర్వహించడానికి మరలా అనుమతి కోరామని, డిసెంబర్‌ 5 వరకు పోలీసులు 30 యాక్ట్‌ అమల్లో ఉందని చెప్పడం చూస్తుంటే తమ విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. రైతు సమస్యల పట్ల పార్టీలకు అతీతంగా సభను నిర్వహిస్తుంటే పోలీసులకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు.
దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామన్నారుర. అనుమతి వచ్చినా రాకపోయినా రైతుభేరి ధర్మయుద్ధ సభను నిర్వహించి తీరుతామన్నారు. తమపై కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున రైతులు తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.