Nov 03,2023 21:50

ఫొటో : సమస్యలు తెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆర్థికాభివృద్ధికి జగనన్న ప్రణాళికలు
ప్రజాశక్తి-అనంతసాగరం : ప్రతి కుంటుంబ ఆర్థికాభివృద్ధికి జగనన్న ప్రణాళికలు తోడ్పడతాయని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని లింగంగుంట సచివాలయం పరిధిలోని బెడుసుపల్లి, లింగంగుంట గ్రామాల్లో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి అందచేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 93 సచివాలయాల్లో 82 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
సియం జగనన్న అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాయా లేదా పరిశీలించడంతో పాటు సమస్యలు, అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను అధికారులకు తెలిపి సత్వరం పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, భూమి లేని ప్రతి ఒక్కరికీ భూములు అందచేయాలనే ఉద్దేశ్యంతో రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గత మూడు నెలలుగా జిల్లా కలెక్టర్‌ నుంచి మండల స్థాయి అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఇప్పటికే కలెక్టర్‌తో అనేక మార్లు రివ్యూ సమావేశాలు నిర్వహించామన్నారు. 7వ తేదీన మళ్లీ కలెక్టర్‌తో రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంటి స్థలాలు, భూములు లేని వారికి వాటిని అందచేసేలా కలెక్టర్‌కు వివరించనున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేశారని, 14 శాతం చిన్నారులు ప్రయివేట్‌ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. మహిళలకు అనేక రకాల పథకాలను అందచేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. పింఛను కోసం ఎవరి దగ్గరకు వెళ్లకుండా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో అందచేస్తున్నారని వివరించారు. ఇలాంటి విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం నెంబర్‌ 1 స్థానంలో నిలుస్తుందన్నారు. త్వరలో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్ను చేసుకుందామన్నారు. 175కు 175 స్థానాల్లో వైసిపి విజయం సాధించేలా ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి సంపూర్ణమ్మ, బెడుసుపల్లి సర్పంచ్‌ లక్ష్మి, వైసిపి నాయకులు కేత రాఘవరెడ్డి, ఓబుల్‌ రెడ్డి, తహశీల్దారు నరసింహులు, ఎంపిడిఒ మధుసూదన్‌ రావు, పలు శాఖల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.