
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - పొందూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, ఆర్థిక నేరం చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రెండో విడతలో నూతనంగా మంజూరైన పింఛన్లను స్థానిక మహారాజా మార్కెట్ ఆవరణలో బుధవారం పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ స్కిల్ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని అన్నారు. షెల్ కంపెనీల పేరుతో నేరానికి పాల్పడడంతో అరెస్టు చేస్తే టిడిపి గగ్గోలు పెడుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నో మోసాలు చేసినా తప్పించుకున్నారని, ఇన్నాళ్లకు దొరికిపోయారని చెప్పారు. గతంలో నేరాలకు పాల్పడిన లాలూప్రసాద్ యాదవ్, జయలలిత, శిబూసోరెన్ వంటి వారు జైలుకు వెళ్లారని, వాళ్ల కంటే చంద్రబాబు గొప్పవారా అని అన్నారు. అనంతరం వైసిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ సమక్షంలో పలువురు వైసిపిలో చేరారు. కార్యక్రమంలో ఎంపిపి కిల్లి ఉషారాణి, పిఎసిఎస్ అధ్యక్షులు కె.రమణమూర్తి, వైసిపి మండల అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్, బండారు జైప్రతాప్‌కుమార్, గాడు నాగరాజు, చింతాడ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.