Oct 28,2023 21:58

ఫొటో : ట్రంక్‌ రోడ్డు పై ర్యాలీ చేస్తున్న ఆర్‌. టి. సి. కార్మికులు

ఆర్‌టిసి కార్మికుల నిరసన ర్యాలీ
ప్రజాశక్తి-కావలి : ఆటోనగర్‌ డిపో బస్‌ డ్రైవర్‌ బొందిలి రామ్‌సింగ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆర్‌టిసి కార్మికులు శనివారం ఆర్‌టిసి బస్టాండ్‌ నుండి ఆర్‌.డి.ఒ. కార్యాలయం వరకు డిపో మేనేజర్‌ శ్రీనివాసులుతో సహా నిరసన వ్యక్తం చేస్తూ, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌.డి.ఒ. వికె.శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుండి వెనుదిరిగి, డి.ఎస్‌.పి. కార్యాలయం వరకు వెళ్లి, డి.ఎస్‌.పి. వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి.ఎస్‌.పి. స్పందిస్తూ గురువారం ఆర్‌.టి.సి. డ్రైవర్‌పై దాడి చేసిన వారిని గుర్తించడం, ఎఫ్‌.ఐ.ఆర్‌. కట్టడం కూడా జరిగిందని తెలిపారు. దాడి చేసిన వారు శివారెడ్డి, దేవరకొండ సుధీర్‌ బాబు, విల్సన్‌, కిరణ్‌,ఇంకా కొంతమంది ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు.
జిల్లా ఎస్‌.పి. తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నిందితులపై 7 సెక్షన్‌లతో కూడిన కేసులు నమోదు చేసి, పోలీసు టీములు తయారు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని హామీనిచ్చారు. కాగా ఆటో నగర్‌ డిపో బస్‌ బెంగళూరు నుండి విజయవాడకు కావలి బస్టాండ్‌ మీదుగా వెళుతుండగా గత గురువారం సాయంత్రం చాపల మార్కెట్‌ ఎదురుగా అడ్డు వచ్చిన కారును చూచి, డ్రైవర్‌ హారన్‌ కొట్టగా, కారులోని దుండగులు బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు. కొందరు అడ్డు వచ్చి విడిపించారు. అక్కడ కుదరక, మళ్లీ కారులో బస్‌ను క్రాస్‌ చేసి, మద్దూరుపాడు వద్ద డ్రైవర్‌ను విచక్షణా రహితంగా కొట్టిన సంఘటన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ సంఘటనపై ఆర్‌.టి.సి. కార్మికులు స్పందించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌, ఇతర యూనియన్‌ల నాయకులు, ఆర్‌టిసి సిబ్బంది పాల్గొన్నారు.