అరటి తోటలపై ఏనుగుల దాడి
చేతికొచ్చిన పంట నేలమట్టం
ప్రజాశక్తి- వికోట : మండల పరిధిలోని గోనుమాకులపల్లె పంచాయితీ నాగిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై విరుచుకుపడి అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. అటవీ సరిహద్దు ప్రాంతమైన నాగిరెడ్డిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు పంటలపై పడి విధ్వంసాన్ని సష్టించాయి. గ్రామానికి చెందిన చిన్నప్పయ్యకు ఉన్న ఎకరం భూమిలో అరటి పంట సాగుచేశాడు. పొలం దున్నకం, ఎరువులు, కూలీలు, విత్తనగడ్డలు, పురుగు మందులు తదితరాలకు సుమారు 1లక్ష 80 రూపాయలు ఖర్చు పెట్టారు. పంట దిగుబడి దశకు చేరింది. కోత కోసే దశలో ఏనుగులు అరటి తోటపై దాడి చేశాయి. తిని తొక్కి నాశనం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గెలలు కోత దశలోకి రావడంతో వ్యాపారులు రెండు రోజుల క్రితం రైతుతో పంట కొనుగోలు విషయమై మాట్లాడారు. శనివారం వరలక్ష్మివ్రతం పండగ ఉండడంతో రెండు రోజులు ముందు విక్రయిస్తే మంచిధర లభిస్తుందని అనుకొని, తర్వాత రావాలని వ్యాపారులకు సూచించానని అన్నారు. అయితే అర్థరాత్రి ఏనుగులు నోటికాడి పంటను నేలపాలు చేశాయని కన్నీటి పర్యంతమయ్యాడు. పంటను నమ్మి చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు సోమశేఖర్ రెండు ఎకరాల్లో టమోటా పంట సాగు చేశారు. పూత, పిందె దశలో ఏనుగులు తిని తొక్కి నాశనం చేశాయి. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ దశలో ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాలయ్య వరిపంట తొక్కి అడవిలోకి ఏనుగులు తిరుగుముఖం పట్టాయి. గత కొన్ని నెలలుగా ఏనుగులదాడి నుంచి ఉపశమనం పొందిన రైతులకు ఉన్నఫలంగా ఏనుగులు పంటలపై దాడి చేయడంతో ఉలిక్కిపడ్డారు. ఏనుగుల రాకపోకలను పసిగట్టుటలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో ఏనుగుల సంచారాన్ని అటవీ సరిహద్దు రైతులకు చేరవేసి అప్రమత్తం చేయడంలో అధికారులు తీవ్రనిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు మండిపడ్డారు. ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతుకు భరోసా ఇవ్వడం.. సకాలంలో ధంసమైన పంటలను సందర్శించి పంట నష్టపరిహారం అందించేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.










