Apr 07,2023 22:58

మీడియాతో మాట్లాడుతున్న ప్రణరురెడ్డి

ప్రజాశక్తి -అనంతపురం      వైసిపి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడానికే నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపట్టారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు, పార్టీ యువజన విభాగం జోనల్‌ ఇన్‌ఛార్జి ప్రణరురెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూడేరు ప్రాంతంలో నారా లోకేష్‌ తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనేక అవినీతి, అక్రమాలు చేసిన ఎమ్మెల్యే కేశవ్‌ను పక్కన పెట్టుకుని వేదాలు వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌లో స్కాం చేసింది చంద్రబాబు, లోకేషే అన్నారు. ఇలాంటి వాళ్లు అవినీతి, అక్రమాల గురించి మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేపట్టాలని, వైసిపి ఎమ్మెల్యేలను, నాయకులను విమర్శించేందుకే లోకేష్‌ యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న జగన్మోహన్‌రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇంటింటికీ జాబ్‌ ఇస్తానని చెప్పారన్నారు. ఒక్క జాబ్‌ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైసిపి నాయకుల పై విమర్శలు చేయడం మాని ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని హితవుపలికారు. టిడిపి నాయకులు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు జగన్‌ వైపే ఉన్నారన్నారు. టిడిపి నాయకులు చేసే తప్పుడు ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు.