
ప్రజాశక్తి- రణస్థలం: ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోగ్య సురక్ష నోడల్ అధికారి, గ్రామ, వార్డు సచివాలయ కమిషనర్ సిద్ధార్థజైన్ అన్నారు. మండలంలోని తెప్పలవలసలో గురువారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీటు కౌంటరు, ల్యాబ్ టెస్టింగ్ కౌంటరు, మందుల పంపిణీ కౌంటరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సురక్షలో అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలను ఆరోగ్యవంతులని చేయడమే లక్ష్యమన్నారు. ఇంటి వద్దకే వచ్చిన వైద్య సిబ్బందికి సహకరించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1.62 కోట్ల కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ధ్యేయంతో 45 రోజుల పాటు 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను నిపుణులైన వైద్యులతో గుర్తించి, వారికి చికిత్స చేయించనున్నామన్నారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా రోగులకు చికిత్స అందించడమే కాకుండా ఇంకా ఏవైనా వ్యాధులు ఉంటే మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నామని చెప్పారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జెడ్‌పిటిసి టొంపల సీతారాం, ఎంపిడిఒ రమణమూర్తి, వైద్యులు కృష్ణచైతన్య, సుమన్, గిరిబాబు, రజని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.