
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలపై ప్రజల్లో విశ్వాసం పెరగాలని ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య సురక్షపై బుధవారం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్త, ఎఎన్‌ఎం మొదలు వైద్యుల వరకు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించడం అత్యంత కీలకమన్నారు. గుర్తించిన రోగానికి సకాలంలో వైద్యం అందించడం వల్ల ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. లెప్రసీ, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్, అంటువ్యాధుల, సీజనల్ వ్యాధులు, బిపి, షుగర్, డయాలసిస్, 104, 108 సేవలపై విభాగాల వారీగా అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఎడిఎంహెచ్‌ఒ అనురాధ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, డిపిఎంఒ లింగరాజు, సి.పి శ్రీదేవి, సుజాత, ప్రవీణ్, ప్రసాద్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.