Sep 25,2023 22:39

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
త్వరలో ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి జిల్లాలో ఇంటింటినీ సందర్శించి మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ ఇంట్లో ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో గుర్తించే ప్రక్రియ చివరి దశలో ఉందని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రతిరోజూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత 594 నచివాలయాలతో పాటు 13 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా కార్యక్రమ నిర్వహణ కోసం మ్యాపింగ్‌ చేసినట్లు చెప్పారు. శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. శిబిరాలకు వచ్చే రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని, ప్రతి శిబిరంలో కనీసం ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పిహెచ్‌సి వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరయ్యేలా చూడాలని వైద్యశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లతో టోకెన్లు అందజేయడం, వారి గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల తేదీపై ముందుగా అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ ప్రకాశరావు, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.