
ప్రజాశక్తి- ఆమదాలవలస: ఆరోగ్య ఆమదాలవలస నిర్మాణమే తన లక్ష్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు, గుత్తేదారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని జొన్నవలసలో ఉన్న సిహెచ్‌సి ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని వంశధార ప్రాజెక్టు పూర్వపు కార్యాలయ ఆవరణలోకి సిహెచ్‌సిని తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తాడివలస, దూసి, బూర్జ, తొగరాం, పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణాల పనులు, వాటి స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా జరుగుతున్న తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే విధంగా పనులు జరిగితే గుత్తేదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నవంబరు నెలాఖరు నాటికి భవననిర్మాణ పనులు పూర్తి చేసి అప్పగించాలని గుత్తేదారులను ఆదేశించారు. భవన నిర్మాణ పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఇప్పటికైనా పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన భవనాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని, తద్వారా ప్రజలకు అక్కడినుండి సేవలు అందించాలన్నారు. సామాన్య ప్రజానీకానికి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే సిఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి బొడ్డేపల్లి మీనాక్షి, వైద్యులు, గుత్తేదారులు పాల్గొన్నారు.