Oct 24,2023 21:35

పూజలు చేస్తున్న ఎస్‌పి దంపతులు

ప్రజాశక్తి - ఎచ్చెర్ల: ఎచ్చెర్లలోని జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో దసరాను పురస్కరించుకుని మంగళవారం ఆయుధపూజ నిర్వహించారు. జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎస్‌పి జి.ఆర్‌ రాధిక దంపతులు పూజా కార్యక్రమాలు చేశారు. పోలీసు ఆయుధాగారం, మోటారు ట్రాన్స్‌పోర్టు విభాగాల్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీసులకు తమ దైనందిన విధులు, సేవల్లో విజయాలు చేకూరాలన్నారు. సమాజంలో పోలీసు విధులు కీలకంగా మారాయని తెలిపారు. పండగ అయినా, బందోబస్తు అయినా పోలీసులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహిస్తారని కొనియాడారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.నాగమణికంఠ, అదనపు ఎస్‌పి టి.పి విఠలేశ్వర్‌, ఆర్‌ఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.