అనంతపురం కలెక్టరేట్ : స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీలు మళ్లీమళీల పునరావృతం కాకుండా వాటికి నాణ్యమైన పరిస్కారం చూపాలని కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఅర్‌ఒ గాయత్రిదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, అన్సెట్ సిఇఒ కేశవ నాయుడు, జెడ్పీ సిఇఒ భాస్కర్ రెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 393 మంది అధికారులకు అర్జీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు నాణ్యతగా పరిష్కరించక పోవడం వల్లనే అవి మళ్లీమళ్లీ పునరావృతం అవుతున్నాయన్నారు. అలా కాకుండా సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి పూర్తి పరిష్కారం చూపితే పునరావృతం కావన్నారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమంపై వర్క్ షాపులు నిర్వహించి, వారి సిబ్బందికి అర్జీల పరిష్కారంపై అవగాహన కల్పించాలన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలకు ఇంకా చర్యల నివేదికలను పంపని అధికారులు, ఆ సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను వెంటనే సిపిఒకు పంపాలన్నారు. మండల కేంద్రాల్లో నిల్వ చేసి ఉన్న జగనన్న విద్యా కానుక కిట్లను తనిఖీ చేసి వారు గుర్తించిన లోటుపాట్లపై నివేదిక పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










