Apr 10,2023 23:12

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : స్పందన కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అందించే అర్జీలకు నాణ్యమైన సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ గాయత్రిదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్డీవో మధుసూదన్‌, అన్సెట్‌, సిఇఒ కేశవనాయుడు, జెడ్పీ సిఇఒ భాస్కర్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 228 అర్జీలను అందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించబడే సమస్యలు కూడా జిల్లా కేంద్రానికి వస్తున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. పిటీషన్లు గడువు తీరేంత వరకు వేచి చూడకుండా అధికారులు సకాలంలో వాటిని పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేలా, వారికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధిచేకూర్చేలా అధికారులు పనిచేయాలన్నారు.