Sep 04,2023 21:50

ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ గౌతిమి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం : కలెక్టర్‌
అనంతపురం కలెక్టరేట్‌ :
జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు నాణ్యతగా పరిష్కారం చూపించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ను అర్జీదారులు 100 శాతం సంతప్తి చెందేలా పరిష్కరించడం సవాలుతో కూడుకున్న అంశమన్నారు. నార్పల, శింగనమల, వజ్రకరూరు తదితర మండలాల్లో సంతప్తి స్థాయి తక్కువగా ఉందని, ఆయా మండలాల అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. సంతృప్తి స్థాయి తక్కువ ఉన్న శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భూమి, ఆర్‌ఒఆర్‌, రహదారి సమస్యలను సర్వే, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. అర్జీదారుడితో వ్యక్తిగతంగా మాట్లాడకుండా పరిష్కారం చూపించరాదని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు ప్రతి బుధవారం సమావేశం నిర్వహించి సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా అధికారుల దష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుషాల్‌ జైన్‌, డిఆర్‌ఒ గాయత్రీ దేవి, ఆర్డీవో మధుసూదన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, నీలమయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.