Jul 24,2023 22:06

కలెక్టరేట్లో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు

      అనంతపురం కలెక్టరేట్‌ : జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంలో నాణ్యత మరింత పెంచి వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ గాయత్రి దేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, ఆర్డీవో మధుసూదన్‌, డిప్యూటీ కలెక్టర్‌ శంకరయ్య, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, డీఈవో సాయిరామ్‌ తదితర శాఖల అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 544 అర్జీలను ప్రజలు అందించారు. అనంతరం స్పందన గ్రీవెన్స్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వస్తున్న స్పందన గ్రీవెన్స్‌ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏఒక్క అర్జీకూడా బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. గడువులోపే అత్యంత నాణ్యతగా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. వీటిపై ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ విధిగా ఉండాలని సూచించారు. అర్జీలకు ఎండార్స్మెంట్‌ ఎలా ఇస్తున్నారు అనేది చూడాలన్నారు. 24 గంటల్లో గడువు పూర్తి అయ్యే అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాయదుర్గం, గుత్తి, తాడిపత్రి తదితర అర్బన్‌ ప్రాంతాల్లో, రాప్తాడు, కనేకల్‌, తదితర మండలాల పరిధిలో ఎక్కువగా ఈకేవైసీ పెండింగ్‌ ఉందని, మండల ఆడిట్‌ టీంలు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.