
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని, అప్పుడే అధికారులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులకు సమస్యలు వివరిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఎస్‌పి రాధికతో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యలు తెలియజేస్తూ వినతిపత్రాలను అందించారు. అధిక సంఖ్యలో బెంతుఒరియాలు తరలివచ్చి అర్జీలను అందించారు. రత్తకన్నకు చెందిన యువత వచ్చి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని కలెక్టర్ చెప్పారు. పట్టణంలో అక్రమణకు గురైన బెల్లుపడ చెరువు సమస్యపైన, రత్తకన్న జగనన్న కాలనీలో ఆక్రమణలపై పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ గురుప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు. అడ్డుకునే వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని సూచించారు. మున్సిపల్ చైరపర్సన్ రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్ లాభాల స్వర్ణమణి, భారతీ దివ్య, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బాలకృష్ణాపురానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బదకల జ్యోతి సోరియాసిస్‌తో బాధపడుతోందని జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి రూ.50 వేలు మంజూరు చేయడంతో పాటు పెన్షన్ ఇప్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, డిఇఒ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ గణపతిరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలు పరిశీలన
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. బ్రాహ్మణ వీధి ఒరియా స్కూల్‌లో ఉన్న 47, 48 పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మార్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సీతారామ్మూర్తి, తహశీల్దార్ గురుప్రసాద్, డిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.