జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
జగనన్నకు చెబుదాం ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో జెకెసి ద్వారా మే 9 నుంచి మొత్తం 4,932 అర్జీలు రాగా, ఇప్పటివరకూ 3,685 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన 919 అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. జెకెసి ద్వారా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ లోఓల్టేజీ, ఆర్‌ఒఆర్, పోలీస్, శానిటేషన్, తాగునీటి సమస్యలపై ఎక్కువ అర్జీలు వచ్చాయన్నారు. అర్జీల పరిష్కారమైన తర్వాత అర్జీదారునికి ఫోన్‌చేసి సమస్య పరిష్కారం విధానంపై కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందకపోతే రీఓపెన్ చేసి అర్జీని సమీక్షిస్తామని తెలిపారు. అర్జీదారునికి మేలైన పరిష్కారం చూపడంలో సంబంధిత శాఖల అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే జెకెసి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ తెలిపారు.










