May 30,2023 09:24

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

              అనంతపురం కలెక్టరేట్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు సంబంధించి రీ ఓపెన్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారులు సంతప్తి చెందేలా వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, ట్రైనీ కలెక్టర్‌ కుశాల్‌ జైన్‌, డిఅర్‌ఒ గాయత్రి దేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, అన్సెట్‌ సిఇఒ కేశవ నాయుడు, ఆర్డీవో మధుసూదన్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో స్వీకరించే అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్క్‌ షాపులు నిర్వహించి, వారిసిబ్బందికి అర్జీల పరిష్కారంపై అవగాహన కల్పించాలని, షెడ్యూల్‌ ప్రకారం సంబంధిత అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అర్జీలన్నింటినీ సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలని,ఏ ఒక్కటి కూడా గడువు దాటిన తర్వాత పరిష్కరించరాదన్నారు. డిఎమ్‌హెచ్‌ఒకు అందిన ఒక అర్జీ గడువు దాటిన తరువాత కూడా పరిష్కరించక పోవడంతో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని డిఆర్‌ఒకు సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన అర్జీలపై పోర్టల్‌ లో పేర్కొన్న ఆప్షన్స్‌ ను డ్రాప్‌ డౌన్‌లో సక్రమంగా ఎంచుకుని సెలెక్ట్‌ చేయగలిగితే జిల్లా అధికారుల లాగిన్‌ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల లాగిన్‌ లోకి వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.