ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయి బ్రాహ్మణ, టైలర్ వత్తిదారులకు నాలుగో విడత ఆర్థిక సాయం కింద రూ. 10,000 ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ అముద, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ రమ్య, స్త్రీ శిశు సంక్షేమశాఖ జోనల్ చైర్‌పర్సన్ శైలజా రెడ్డి, జెడ్పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికారి రబ్బానీ బాష, లబ్ధిదారులు వీక్షించారు. ఎంపీ ఎన్.రెడ్డప్ప మాట్లాడుతూ సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకంగా అర్హులకు చేరవేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ. 2023-24 సంవత్సరంలో నాల్గవ విడత కింద 8,662 లబ్ధిదారులకు రూ.8.66కోట్లు ఆర్థిక లబ్ధి చేకూరడం జరిగిందని తెలిపారు. ఇదే విధంగా జగనన్న చేదోడు కింద గతంలో 2020-21 సంవత్సరంలో (మొదటి విడత) లబ్ధిదారుల సంఖ్య 8306 సాయం (రూ.8.31కోట్లు, 2021-22 సంవత్సరంలో (రెండవ విడత) లబ్ధిదారులసంఖ్య 8226 సాయం రూ.8.23 కోట్లు. 2022-23 సంవత్సరంలో (మూడవ విడత) లబ్ధిదారుల సంఖ్య 9477సాయం రూ.9.48 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు.










