Sep 29,2022 21:59

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆర్థికాభివద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్‌ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి అన్నారు. గురువారం జిడి.నెల్లూరు ఎంపిడిఓ కార్యాలయం ఆవరణంలో మూడవ విడత వైఎస్‌ఆర్‌ చేయూతకు సంబంధించి మండలంలోని 3,285 మంది లబ్దిదారులకు రూ.6,15,94,000ల మెగాచెక్కును అందజేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నవరత్నాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికీ సంవత్సరానికి రూ.18,750లు చొప్పున నాలుగు సంవత్సరాలకు గానూ రూ.75,000వేలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. దసరా పండుగ కానుకగా మూడవ విడత వై.ఎస్‌.ఆర్‌ చేయూతను జగనన్న మహిళలకు అందిస్తున్నారన్నారు. ఆర్‌టిసి వైస్‌చైర్మన్‌ విజయానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, మహిళలు వారి కుటుంబాలను ఎంత చక్కాగా చూసుకుంటారో అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పొందే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశ్యంతో పథకాలలబ్ధిని మహిళలకు చెందేలా పథకాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అనిత, జెడ్‌పిటిసి లక్ష్మిప్రియ, ఎంపిడిఓ శ్రీదేవి, తహశీల్దార్‌ ఇన్బనాథన్‌, ప్రజాప్రతినిధులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.