రాయదుర్గం : పట్టణంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ స్థలంతోపాటు ఇల్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గంలో నేటికీ సొంతిల్లులేని నిరుపేదలు అనేకమంది ఉన్నారన్నారు. సొంత గూడు లేక చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలకు సరైన విద్య, వైద్యం అందించుకోలేని దుస్థితిలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికార పార్టీ నాయకులు ప్రతిపాదించిన అనుచరులు, వారికి సంబంధించిన వారికే ఇల్లు, ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే నగరంలో స్థలం, ఇల్లు లేని పేదలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ మారుతీప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నాగరాజు, పట్టణ సహాయ కార్యదర్శి మధు, నాయకులు తిమ్మరాజు, రమేష్, పి.నాగరాజు, హారూన్, అంజి, మల్లికార్జున, మహేష్, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు










