Oct 17,2022 22:45

అర్హులైన పేదలందరికీ సొంతిళ్లు : మంత్రి రోజా
ప్రజాశక్తి- నగరి:
అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని.. జగనన్న కాలనీలు ఊర్లుగా మారుతున్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. సోమవారం నగరిలోని జగనన్న కాలనీల్లో జరుగుతున్న గృహనిర్మాణాలను మంత్రి పరిశీలించారు. దాదాపు 1200 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న జగనన్న కాలనీలో పైకప్పు వేసేందుకు పూజలు చేపట్టారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని.. ప్రతి ఒక్కరూ జగన్మోహన్‌ రెడ్డిని సొంత అన్నలా భావిస్తున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి, తాను ఎలాంటి అభివద్ధి పనులు చేయడం లేదని ఏసీ రూముల్లో కూర్చుని తమ అనుకూల పచ్చ మీడియాలో ఇస్టానుసారంగా భేటీలిచ్చే చోటా నాయకులు .. ఇలాంటి జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను చూడాలని.. ఇష్టానుసారంగా వెదవ మాటలు మాట్లాడితే నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీకి అమ్ముడుపోయాడు
విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాలకు వ్యతిరేకంగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీకి అమ్ముడుపోయినట్లున్నారని.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో వైజాగ్‌లో మాత్రమే ర్యాలీ చేపట్టడం వెనుక కుట్ర ఉందని తెలిపారు. జనసేన నాయకులు వైసీపీ నాయకులు, మంత్రులు వెళ్లే కాన్వారు దగ్గరికి ఎందుకు వచ్చారని.. వారి చేతుల్లోకి రాడ్లు, రాళ్లు, కర్రలు ఎలా వచ్చాయో ఆలోచించాలన్నారు. పవన్‌ కళ్యాణే వారి జనసైకోలను రెచ్చగొట్టి పంపించాడనే విషయం అందరికి అర్థమవుతుందన్నారు. దాడిలో తన సిబ్బందికి గాయాలై 10కుట్లు పడ్డాయని.. చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్లు దాడికి గురైన తమని కాకుండా దాడి చేసిన పవన్‌ కళ్యాణ్‌కి ఫోన్‌చేసి పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదమని.. వారి తండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన వ్యక్తులకు వత్తాసు పలకడం చాలా బాధాకరమన్నారు.