Sep 15,2023 23:16

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
అర్హులైన దళితులకు జగనన్న కాలనీల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు అవకాశముందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కమిటీ సభ్యులు కంఠ వేణు మాట్లాడుతూ అంపోలు వద్ద ఎస్‌సి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాన్ని కేటాయించాలన్నారు. దీనిపై జెసి స్పందిస్తూ అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు. బోసు మన్మథరావు మాట్లాడుతూ మాదిగలకు కమ్యూనిటీ హాలుకు స్థలం కేటాయించాలని కోరారు. టెక్కలి మండలంలో దళితులకు ఇచ్చిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని సభ్యులు చిరంజీవి ప్రస్తావించగా, విచారణ చేపడతామని జెసి హామీనిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని చిరంజీవి ప్రస్తావించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహన్‌ రెడ్డిని జెసి ఆదేశించారు. సమావేశంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, ఆర్‌డిఒలు సీతారామ్మూర్తి, బి.శాంతి, ఎపిపి ఎం.మల్లేశ్వరరావు, డిఎస్‌పిలు డి.విజరు కుమార్‌, బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.